Friday, 10 February 2017

Om Namo Venkatesaya review


Story of Hathiram Bhavaji


Genre: Devotional
Type: Straight
Banner: Sai Krupa Entertainment
 Runtime: 144 minutes Censor Certificate: U Release date: 10 February, 2017

 Cast: Nagarjuna, Saurabh Raj Jain, Anushka, Pragya Jaiswal, Jagapathi Babu (special role), Vimala Raman, Ashmita, Rao Ramesh, Sampath Raj, Sai Kumar, Brahmanandam, Vennela Kishore, Raghu Babu, Pruthvi .etc
Music: MM Keeravani
Cinematography: S Gopal Reddy
Art: Kiran Kumar Manne
 Editor: Gautam Raju & K Vikram Kumar
 Lyrics: Chandrabose, Ramajogayya Sastry, K. Shivashakti Datta, Dr. K. Ramakrishna, Ananta Sriram & Vedavyasa
Story, Dialogues: JK Bharavi
Screenplay, Direction: K Raghavendra Rao Producer: A. Mahesh Reddy


కింగ్ అక్కినేని నాగార్జునతో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మరో భక్తిరస చిత్ర్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాల మధ్యన నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఆధ్యాత్మిక చిత్రం ఎలా ఉందీ? చూద్దాం..

 కథ : ఉత్తర భారతదేశానికి చెందిన రామ్ (నాగార్జున) అనే వ్యక్తి చిన్నతనం నుండే దేవుడిని చూడాలి అనే కోరికతో తిరుమలలోని పద్మానంద స్వామి (సాయి కుమార్) అనే గురువు వద్దకు చేరుకొని విద్యనభ్యసించి, దేవుడి కోసం తపస్సుకు కూర్చుంటాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని అప్పుడు గుర్తించలేని రామ్ తరువాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న కొంతమంది దుర్మార్గుల వలన దేవుడిని చేరుకోలేకపోతాడు. ఆ క్రమంలోనే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క) ను కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు. అతని భక్తికి, పని తననానికి ముగ్దుడైన స్వామి మరోసారి అతనికి దగ్గరై అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు. కానీ కొందరు చెడ్డవారు మాత్రం రామ్ ను అక్కడి నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తారు. ఆ దుర్మార్గులు ఎవరు? రామ్ హాతిరామ్ బావాజి ఎలా అయ్యాడు ? అతనికి శ్రీ వేంకటేశ్వర సామికి మధ్య బంధం ఎలా సాగింది ? హాతిరామ్ బావాజి జీవితం ఎలా సాగింది ? చివరికి అతని భక్తి అతడ్ని ఎక్కడకు చేర్చింది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ : సినిమాలోని ఆకర్షణీయ అంశాల్లో ముందుగా చెప్పాల్సింది నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్ ల నటన గురించి. ఈ చిత్రం ద్వారా నాగార్జున మరోసారి ‘అన్నమయ్య’ చిత్రాన్ని గుర్తు చేశారు. ఆయన నటన ఆరంభం నుండి చివరి దాకా ప్రతి సన్నివేశానికి జీవం పోసింది. కళ్ళలో ఉట్టిపడే భక్తి భావం, మాటల్లో ఆర్ద్రత, నడవడికలో క్రమశిక్షణ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఎక్కడా ఒక అగ్ర హీరోలా కాకుండా పరమ భక్తుడిగానే కనిపించారాయన. ఇక వేంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన సౌరభ్ రాజ్ జైన్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. ఆహార్యంలో తేజస్సు, ముఖ కవళికల్లో, మాటల్లో భక్తుల పట్ల ఆదరణను ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తూ దేవుడినే చూస్తున్న భావన కలిగించాడు. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం కన్నార్పకుండా చూసేలా ఉంది. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు మరోసారి తన దర్శకత్వానికి తిరుగులేదని నిరూపించారు. మొదటి భాగమంతా నాగార్జున జీవితం మీద, అతను తిరుమల చేరుకొని, ఆ క్షేత్రాన్ని బాగు చేయడం మీద నడిపి ఆకట్టుకుని ద్వితీయ భాగం మొత్తం దేవుడికి, భక్తుడికి మధ్యన గల హద్దులులేని భక్తి, ఆదరణ అనే అనుబంధాల్ని చాలా భావోద్వేగంగా ఆవిష్కరించి మైమరపింపజేశారు. ముఖ్యంగా రెండవ భాగంలో హాతి రామ్ బావాజి, వేంకటేశ్వర స్వామి మధ్య నడిచే పాచికలాట, రామ్ హాతిరామ్ బావాజిగా మారడం, భక్తుడే దేవుడికన్నా గొప్పవాడు అని చెప్పే అంశం, తన ప్రియమైన భక్తుడి కోసం దేవుడంతటివాడు వేదన చెందడం లాంటి సందర్భాలు మనసును కదిలించాయి. ఇక మధ్యలో వచ్చే కీరవాణి భక్తి పాటలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ ల మధ్య తెరకెక్కించిన ఒక రొమాంటిక్ సాంగ్ కూడా రాఘవేంద్రరావు మార్క్ తో చూడటాని బాగుంది. తిరుమల వాతావరణాన్ని చాలా అందంగా చూపిన ఎస్. గోపాల్ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది.

మైనస్ పాయింట్స్ : ఈ భక్తిరస చిత్రంలో బలహీనతలంటే కృష్ణమ్మ (అనుష్క) ఎపిసోడ్ అని చెప్పొచ్చు. భక్తురాలిగా ఆమె ప్రస్తుతం బాగున్నా గతం అంత బలంగా లేదు. అందులో జగపతి బాబు పాత్ర కూడా ఆశించినంత ప్రాభావితంగా ఏం లేదు. మొత్తంగా ఆ ఎపిసోడ్ తో కథనం కొంచెం నెమ్మదించింది. అలాగే ఫస్టాఫ్ లో రావు రమేష్ పాత్ర చుట్టూ అల్లిన కొన్ని సన్నివేశాల నైపథ్యం అంతే అయినా వాటిని చూపిన విధానం పాతదే కావడం నిరుత్సాహపరించింది. ఇక కథకు ప్రభాకర్ ధరించిన మాంత్రికుడి పాత్ర అవసరం సరైనదే అయినా దాన్ని అంత హడావుడిగా తేల్చేయడం మింగుడు పడలేదు.

 సాంకేతిక విభాగం : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు భక్తి రస చిత్రాలను తెరకెక్కించడంలో తనకు సాటి లేదని మరోసారి నిరూపించారు. మంచి కథనం, అందులో భావోద్వేగపూరితమైన సన్నివేశాలు, వాటిలో ప్రతిభ ఉన్న నటీనటుల నటనతో చిత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారాయన. సినిమాకి ముఖ్యమైన భక్తుడి భక్తి భావాన్ని, దేవుడి ఆదరణను, వాటి రెండింటి మధ్య సంబంధాన్ని చాలా బాగా తెరపై ఆవిష్కరించారు. కె.కె. భారవి అందించిన కథ కాస్త కల్పితమే అయినా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పింది. భక్తి పాటలకు కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది. ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. అది సినిమాకి అదనపు బలమవుతుందనడంలో సందేహమేలేదు. గౌతమ్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ఏ. మహేష్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

 తీర్పు : ఈ చిత్రంతో రాఘవేంద్రరావుగారు మరోసారి ప్రేక్షకుల్లోని భక్తి భావాన్ని తట్టి లేపారు. మంచి కథ, కథనాలు, నాగార్జున, సౌరబ్ రాజ్ జైన్ ల నటన, భావోద్వేగ పూరితమైన సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు, భక్తుడి భక్తిని, దేవుడి ఆదరణను తెరపై చూపడంలో రాఘవేంద్రరావుగారి టేకింగ్, అందమైన సినిమాటోగ్రఫీ, వినదగిన పాటలు ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా కాస్త రొటీన్ గా అనిపించిన ప్రథమార్థంలోని కొన్ని సన్నివేశాలు, ద్వితీయార్థంలో బలహీనంగా ఉన్న అనుష్క ఎపిసోడ్ లు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద ఈ ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం వేంకటేశ్వర స్వామి భక్తులనేగాక ఇతర ప్రేక్షకులను కూడా భక్తి ప్రవాహంలో ముంచగలిగే చిత్రం.

No comments:

Post a Comment